Thursday, August 28, 2008

అన్నమయ్య సంకీర్తనల రాగి రేకులు ఎన్ని లభ్యమయ్యాయి?

తిరుమలలో స్వామి వారి హుండీ ఎదురుగా ఉన్న మంటపంలో తాళ్ళపాక వారి అర అనే గదిలో అన్నమయ్య సంకీర్తనల తామ్ర ఫలకాలు లభ్యమయ్యాయి. దీనినే సంకీర్తనా భాండాగారం అని అంటారు.




అన్నమయ్య సంకీర్తన రాగి రేకు











 సంకీర్తనా భాండాగారం.

ఇప్పటి వరకూ 2600 రాగి రేకులు సంకీర్తనా భాండాగారంలో లభించాయి. ఒక్కొక్క రేకుకి ఆరు సంకీర్తనల చొప్పున మొత్తం 15600 సంకీర్తనలు దొరికాయి.
అయితే ఇవి అన్నమయ్య రచించిన 32,000 కీర్తనలో సగం మాత్రమే.
మిగతా సగం ఏమైనట్టు?
అహోబిలం, శ్రీరంగం వంటి ప్రదేశాలలో కూడా వీటి ప్రతులు కొన్ని దొరుకుతున్నాయట. అక్కడ వాటి విలువ తెలియక కరిగించి రాగి పాత్రలు చేయించారట. తిరుమలలోనూ ఇలాగే జరిగి ఉంటుందని జనశృతి ఉంది.
బహుశా శత్రుదేశ దాడుల నుంచి ఈ సంకీర్తనలను కాపాడటానికి పెదతిరుమలయ్యా, చిన్నన్నలు ఈ రాగి రేకులని అలా దాచి పెట్టి ఉండవచ్చు. అలాగే ఒక్క చోటే కాక అహోబిలం, శ్రీరంగం వంటి ప్రదేశాలలోనూ దాచి ఉండవచ్చు.
ఏదేమైనా లభ్యం కాని అన్నమయ్య సంకీర్తనల గురించి ఇంకా పరిశోధనలు జరగాలి.

Wednesday, August 27, 2008

అన్నమయ్యకు కర్నాటక సంగీత త్రిమూర్తులలో స్థానం లేదు ఎందుకు?



ఇది నన్ను ఎప్పట్నుంచో తొలిచేస్తున్న ప్రశ్న.
కర్నాటక సంగీత త్రిమూర్తులు గా చెప్పుకునే ముత్తు స్వామి దీక్షితార్, త్యాగయ్య, శ్యామశాస్త్రి ముగ్గురూ 18,19 శతాబ్దాలలో జీవించిన వారు. కానీ అన్నమయ్య 15వ శతాబ్దం వాడు.
ముప్పైరెండు వేల సంకీర్తనలు రచించి ఆ శ్రీనివాసుడి పదకమలములకు సవినయంగా సమర్పించిన భక్తాగ్రేసరుడైన అన్నమయ్యకు సంగీత త్రిమూర్తులలో స్థానం ఎందుకు లభించలేదు?
ఈ సందేహం నేను నా మిత్రులు చాలా మంది దగ్గర ప్రస్తావించినా ఎవరి వద్ద నుండీ నాకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు. చాలా మంది అన్నమయ్య సంకీర్తనలు రచించాడే కానీ ఆయనకు సంగీతం తెలిసి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇక నా అంతట నేనే అంతర్జాలంలోనూ, పుస్తకాలలోనూ శోధించి తెలుసుకున్న విషయాలు ఈ క్రింద తెలియజేస్తున్నాను.
  1. అన్నమయ్యకి సంగీతం గురించి తెలిసి ఉండక పోవచ్చు అనే అభిప్రాయంలో ఏమాత్రం నిజం లేదు.లభ్యమైన అన్నమయ్య సంకీర్తనా రాగి రేకులలో ఆ సంకీర్తనలకి రాగాలు నిర్దేశించబడ్డాయి.. కానీ తాళ నిర్దేశం మాత్రం లేదు.
  2. అన్నమయ్య కాలానికి సంగీతం మొత్తం ఒకే శాఖలా ఉండేది. అప్పటికి ఇంకా హిందుస్తానీ, కర్నాటక సంగీతం అనే విభజన ఏర్పడలేదు. అందుకే అన్నమయ్య కీర్తనలలో నవరోజ్ , ఖమాస్ వంటి హిందుస్తానీ రాగాలు కూడా కనిపిస్తాయి. కర్నాటక సంగీతానికి మూల పురుషుడైన పురందరదాసు అన్నమయ్య తర్వాత ఎనభై ఏళ్ళకి జన్మించాడు. అన్నమయ్యను పురందరదాసు కలిసాడనే దానిపై చరిత్రకారులకూ,పండితులకూ ఏకాభిప్రాయం లేదు.
  3. ఇక చివరిది అన్నమయ్య సంకీర్తనలకు ప్రాణం సాహిత్యమే కానీ సంగీతం కాదు. వెంకటేశ్వర భక్తీ తత్త్వాన్ని ప్రజలకి అందించే ప్రక్రియలో సంగీతం ఆయనకు ఒక సాధనంలా ఉపయోగపడిందే కానీ ఆయన సంకీర్తనల్లో సాహిత్యానిదే పై చేయి. ఆ సంకీర్తనలకు నిర్దేశించబడే రాగాలు మార్గదర్శకాలే కానీ ఆ కీర్తనను ఆ రాగంలోనే పాడాలన్న నియమం ఏమీ లేదు.ఆ కీర్తనలోని మాధుర్యం చెడకుండా ఎవరైనా వాటికి కొత్త రాగాలలో స్వరరచన చేయొచ్చు. అవి కూడా కొత్త రాగాలలోకి అంతే చక్కగా ఒదిగిపోతాయి. కానీ త్యాగయ్య వంటి వాగ్గేయకారుల కృతులు అలా కాదు. వాటిలో సాహిత్యానికన్నా ప్రాధాన్యత ఎక్కువ. త్యాగయ్య కృతులకు కొత్త రాగాలు కట్టటానికి ఎవ్వరూ సాహసించరు.వారు రాగ లక్షణాలు నిర్వచించి, కొత్త రాగాలు సృష్టించీ కర్నాటక సంగీతాన్ని ఉచ్చ స్థితికి తీసుకు వెళ్ళారు. అందుకే వారు ముగ్గురూ కర్నాటక సంగీత త్రిమూర్తులుగా కీర్తింపబడుతున్నారు.
ఏది ఏమైనా అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడనేది నిర్వివాదాంశం. అన్నమయ్య నుండి త్యాగయ్య సంగీతాన్నీ, క్షేత్రయ్య నృత్యాన్నీ,రామదాసు భజన సంప్రదాయాన్ని స్వీకరించి తమదైన శైలిలో పదాలు రచించి చిరస్మరణీయులైనారు. వారందరికీ స్ఫూర్తి అన్నమయ్యే.

Monday, August 25, 2008

ఈ బ్లాగు ఎందుకు రాస్తున్నానంటే

ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను అన్నమయ్య గురించి ఒక బ్లాగు వ్రాద్దామని. చివరికి ఇప్పటికి కుదిరింది. అంతర్జాలంలోఇప్పటికే అన్నమయ్య మీద కొన్ని బ్లాగులూ, వెబ్ సైట్లూ ఉన్నా నాకు కూడా అన్నమయ్య సంకీర్తనా సౌరభానికి నా వంతు కృషినేనూ చెయ్యాలనే ఈ బ్లాగు ప్రారంభిస్తున్నాను.
"అన్నమయ్య సంకీర్తనల గురించి మాట్లాడటానికి నాకున్న అర్హతలేమిటి?" అని ఈ బ్లాగు ప్రారంభించే ముందు చాలా భయపడ్డాను.
అన్నమయ్య సంకీర్తనల గురించి ప్రస్తావించేందుకు నాకు ఏ అర్హతలూ లేవు. ఉన్నదల్లా అన్నమయ్య సంకీర్తనలంటే ఎనలేని అభిమానమూ ,ఆయన కీర్తనల లోని అలౌకికతకి పరవశించే మనసూ,ఆ మహా వాగ్గేయకారుని సంకీర్తనలని ఆస్వాదించగలిగే రెండు చెవులు మాత్రమే.
కానీ అన్నమయ్య సంకీర్తనలు అందరివీ అన్న ధైర్యం ఒక్కటే నన్ను ఈ బ్లాగు రాయటానికి పురికొల్పింది.
ఇప్పటికే అన్నమయ్య సంకీర్తనల పై కొన్ని బ్లాగులు ఉన్నాయి కానీ అన్నమయ్య జీవితం గురించి కానీ ఆయన రచనా వైభవం గురించి కానీ ఆయన సంకీర్తనల లోని విశేషాలను గురించి వివరించే బ్లాగులు ఎక్కువ లేవు.

అన్నమయ్య కీర్తనలే కాక ఆయన జీవితం గురించీ , ఆయన రచనల గురించీ తెలియచేప్పాలనేది ఈ బ్లాగు ముఖ్యోద్దేశ్యం.
క్రమం తప్పక అన్నమయ్య గురించీ ఆయన కీర్తనల గురించీ నాకు తెలిసిన విషయాలు ఈ బ్లాగులో ప్రచురిస్తాను.