Wednesday, August 27, 2008

అన్నమయ్యకు కర్నాటక సంగీత త్రిమూర్తులలో స్థానం లేదు ఎందుకు?



ఇది నన్ను ఎప్పట్నుంచో తొలిచేస్తున్న ప్రశ్న.
కర్నాటక సంగీత త్రిమూర్తులు గా చెప్పుకునే ముత్తు స్వామి దీక్షితార్, త్యాగయ్య, శ్యామశాస్త్రి ముగ్గురూ 18,19 శతాబ్దాలలో జీవించిన వారు. కానీ అన్నమయ్య 15వ శతాబ్దం వాడు.
ముప్పైరెండు వేల సంకీర్తనలు రచించి ఆ శ్రీనివాసుడి పదకమలములకు సవినయంగా సమర్పించిన భక్తాగ్రేసరుడైన అన్నమయ్యకు సంగీత త్రిమూర్తులలో స్థానం ఎందుకు లభించలేదు?
ఈ సందేహం నేను నా మిత్రులు చాలా మంది దగ్గర ప్రస్తావించినా ఎవరి వద్ద నుండీ నాకు సంతృప్తికరమైన సమాధానం రాలేదు. చాలా మంది అన్నమయ్య సంకీర్తనలు రచించాడే కానీ ఆయనకు సంగీతం తెలిసి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
ఇక నా అంతట నేనే అంతర్జాలంలోనూ, పుస్తకాలలోనూ శోధించి తెలుసుకున్న విషయాలు ఈ క్రింద తెలియజేస్తున్నాను.
  1. అన్నమయ్యకి సంగీతం గురించి తెలిసి ఉండక పోవచ్చు అనే అభిప్రాయంలో ఏమాత్రం నిజం లేదు.లభ్యమైన అన్నమయ్య సంకీర్తనా రాగి రేకులలో ఆ సంకీర్తనలకి రాగాలు నిర్దేశించబడ్డాయి.. కానీ తాళ నిర్దేశం మాత్రం లేదు.
  2. అన్నమయ్య కాలానికి సంగీతం మొత్తం ఒకే శాఖలా ఉండేది. అప్పటికి ఇంకా హిందుస్తానీ, కర్నాటక సంగీతం అనే విభజన ఏర్పడలేదు. అందుకే అన్నమయ్య కీర్తనలలో నవరోజ్ , ఖమాస్ వంటి హిందుస్తానీ రాగాలు కూడా కనిపిస్తాయి. కర్నాటక సంగీతానికి మూల పురుషుడైన పురందరదాసు అన్నమయ్య తర్వాత ఎనభై ఏళ్ళకి జన్మించాడు. అన్నమయ్యను పురందరదాసు కలిసాడనే దానిపై చరిత్రకారులకూ,పండితులకూ ఏకాభిప్రాయం లేదు.
  3. ఇక చివరిది అన్నమయ్య సంకీర్తనలకు ప్రాణం సాహిత్యమే కానీ సంగీతం కాదు. వెంకటేశ్వర భక్తీ తత్త్వాన్ని ప్రజలకి అందించే ప్రక్రియలో సంగీతం ఆయనకు ఒక సాధనంలా ఉపయోగపడిందే కానీ ఆయన సంకీర్తనల్లో సాహిత్యానిదే పై చేయి. ఆ సంకీర్తనలకు నిర్దేశించబడే రాగాలు మార్గదర్శకాలే కానీ ఆ కీర్తనను ఆ రాగంలోనే పాడాలన్న నియమం ఏమీ లేదు.ఆ కీర్తనలోని మాధుర్యం చెడకుండా ఎవరైనా వాటికి కొత్త రాగాలలో స్వరరచన చేయొచ్చు. అవి కూడా కొత్త రాగాలలోకి అంతే చక్కగా ఒదిగిపోతాయి. కానీ త్యాగయ్య వంటి వాగ్గేయకారుల కృతులు అలా కాదు. వాటిలో సాహిత్యానికన్నా ప్రాధాన్యత ఎక్కువ. త్యాగయ్య కృతులకు కొత్త రాగాలు కట్టటానికి ఎవ్వరూ సాహసించరు.వారు రాగ లక్షణాలు నిర్వచించి, కొత్త రాగాలు సృష్టించీ కర్నాటక సంగీతాన్ని ఉచ్చ స్థితికి తీసుకు వెళ్ళారు. అందుకే వారు ముగ్గురూ కర్నాటక సంగీత త్రిమూర్తులుగా కీర్తింపబడుతున్నారు.
ఏది ఏమైనా అన్నమయ్య తొలి తెలుగు వాగ్గేయకారుడనేది నిర్వివాదాంశం. అన్నమయ్య నుండి త్యాగయ్య సంగీతాన్నీ, క్షేత్రయ్య నృత్యాన్నీ,రామదాసు భజన సంప్రదాయాన్ని స్వీకరించి తమదైన శైలిలో పదాలు రచించి చిరస్మరణీయులైనారు. వారందరికీ స్ఫూర్తి అన్నమయ్యే.

No comments: